కథలు - లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కథలు - లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, అక్టోబర్ 2026, మంగళవారం

చీకటి దారిలో వెన్నెలల అడుగుజాడలు - 1 [64 ]

భవ్య ఉలిక్కిపడింది. పొద్దుటినుండీ ఆమె మనసు అదీ ఇదీ అని చెప్పలేని దిగులు, విప్పి చెప్పలేని గుబులు, ఒక రూపు కట్టని చిత్రంలా, ఆమె ఆలోచనలు కేవలం వర్ణ సమ్మేళన చాలనంలా మిగిలిపోతూ, ఆ ఆలోచనల ఉరవడిల సుడిగుండంలో చిక్కుకుపోయి, ఒంటరిగా సతమతమవుతూంది ......!  

కిటికీ దగ్గర కూర్చున్న భవ్యకు పక్కింటి అమ్మాయి - జనని - ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. జనని, ఆమె భర్త  ప్రసన్నకుమార్‌లకు తమ ఇంట్లో ముందు గది అద్దెకిచ్చి ఏడాది అవవస్తున్నది.  జనని ప్రవర్తన నడవడికలు ' క్రమశిక్షణ అనే తరాజుకు రెండు తూకపు సిబ్బెలుగా ఉంటాయి.

వాస్తవానికి ఆమె వచ్చాక, తమ ఇంట్లోకి జీవచైతన్య కిరణం ఒకటి దారితప్పి వచ్చిందేమో అనిపిస్తుంది.

తమ వాకిట్లో, పెరట్లో గడ్డిగాదంతో అడ్డదిడ్డంగా - అడ్డగోలుగా, అడ్డుగోడలుగా పెరిగిన చెత్తనంతా శుభ్రం చేసి, చిన్న సైజు బృందావనంలా తన కళాభిరుచికి అద్దం పట్టినట్లు తీర్చిదిద్దింది  జనని.

అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఉదయరాగంలో ఒక తెగిన తంత్రి ధ్వని దూకింది.

నిన్ననే,  జనని తల్లితండ్రులు వచ్చారు.

ఎవరి ఇంటికైనా తల్లిదండ్రులు రావడంలో వింత ఏమున్నది!!?

 జనని దంపతులు - అంటే ఆమె భర్త ప్రసన్నకుమార్‌ల తరఫున ఎప్పుడూ బంధువులు ఎవరూ వచ్చినట్లు కనబడలేదు ...... ,

ప్రప్రధమంగా నిన్ననే వచ్చిన వారి జన్మదాతలు రావడమే తుఫానులా విరుచుకు పడ్డారు.

అప్పుడు తెలిసింది వీధిలోని వారికి, అందరికీ ...... ,

జనని - లేచిపోయి వచ్చిన అమాం బాపతు సరుకు - అని.

వాడకట్టు, చీరకట్టులను సవరించుకుని, నడుం కట్టుకువచ్చి, చోద్యమంతా చూసి, మరీ మరీ నోళ్ళు నొక్కుకున్నారు.

ఎట్లాగో ఆచూకీ కనుక్కుని వచ్చి, ఆ ఆలుమగల రక్తసంబంధీకులు వాకిట్లో భీభత్సంగా అరిచారు. కానీ, స్థిరచిత్తంతో, కృతనిశ్చయంతో -  జననీ ప్రసన్నకుమార్ జంట - ఏమాత్రం తొణకకుండా ఒక్కటే చెప్పేసారు -

"మేమిద్దరమూ భార్యాభర్తలుగానే జీవిస్తాము, మమ్మల్ని ఎవరూ విడదీయలేరు."అని. ఓడిపోయిన వారి చుట్టపక్కాలు వాడిపోయిన మోములతో - ధుమధుమలోడ్తూ వెనక్కి మళ్ళక తప్పలేదు. 

నిన్న సాయంత్రం నుండీ భవ్య యోచనాసాగరంలో మునిగిపోయింది.

***************************************************  ,  
భవ్య బూజు పట్టి, దుమ్ము పట్టిన తన ముఫ్ఫై ఒక్క ఏళ్ళ 'బ్రతుకు పుస్తకాన్ని ' తిరగేసుకోసాగింది.
భవ్య ముగ్గురు చెల్లెళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళతో కూడిన సంసారంలో పుట్టింది ..... కాదు కాదు, మధ్య  తరగతి కుటుంబంలో మొదటి కూతురుగా పుట్టించబడింది. ఇవి చాలవన్నట్లు, మంచంలో తాతయ్య, నీరసంతో మంచానికి ఆనుకుని జేరగిలబడి, విటమిన్లూ, పోషక పదార్ధాలూ లేని శుష్కదేహానికి ఆనవాలుగా రోగిష్ఠి తల్లి, ఆమె ఒళ్ళో పాలకై ఏడ్చీ ఏడ్చీ పాలే లేని ఖాళీ "చను పీక"ను పీలుస్తూ ఆకలితో అట్లాగే సొమ్మసిల్లి, నిద్రలోకి జారుకునే ఒక చంటిబిడ్డ - సగటు జీవితపు భిత్తికపై మరకలే - నైరూప్య చిత్రంగా మిగిలిపోయిన - బాల్యావస్థ నుండీ భవ్య నడయాడిన ఇల్లు అది ...... ,
మితిమీరిన అప్పులు తీర్చే మార్గం లేక - తండ్రి ఆఫీసులో డబ్బు తీసుకున్నాడు. దొంగతనం తప్పు, నేరమే కాబట్టి - సస్పెండ్ ఐ, శిక్షకు గురి అయ్యాడు. ఫలితంగా కుటుంబ భారం  భవ్య భుజాలపై పడింది. కళ్యాణ మండపంలో కూర్చోవలసిన లేత వయసులో ఆమె ఆఫీసులో కూర్చుంది. 
పర్మనెంటు అవని ప్రైవేటు ఉద్యోగాలు - ఏడాదికి రెండు మూడు మారేది. నాలుగేళ్ళ తర్వాత ఎట్లాగో ఒక ఉద్యోగంలో కుదురుగా సెటిల్ అయ్యింది.
ఆమె తాతయ్య పోయాడు. 
ఆ స్థానంలో మేనత్త మీనాక్షమ్మ - తన ముగ్గురు పిల్లలతో దిగి, ఆ కాస్తా భర్తీ చేసేసింది. 
మీనాక్షమ్మ భర్త స్థితి, అలవాట్లు కూడా ఇంచుమించు - 
భ్వ్య తండ్రికి డిటో డిటోనే - కానైతే ఒక అదనపు సుగుణాలంకారం తగిలించుకున్న మనిషి, అతను పక్కా పేకాటరాయుడు - దొరికినంత మేరా అప్పులు చేసాడు. ఆనక ఇకపై - పై డబ్బు, పైసలు, మనీ - కనీసం ఆ పర్యాయపదాలు కూడా మబ్బుల్లో నీళ్ళు అనీ, ఇంక అప్పులు దొరకవి అనే సంగతిని తేల్చుకుని, కనుచూపుమేరలో అగుపించకుండా - సింపుల్‌గా పారిపోయాడు. 
కనుకనే - తప్పని పరిస్థితులలో మేనత్త మీనాక్షమ్మ అన్నగారి పంచన చేరింది. 
వదిన, అన్నల పంచన చేరిన ఆమెకు తెలియకనా - ఈ ఇల్లు ఆకులు రాలిన శిశిర వృక్షమనీ, ఆ చిటారు కొమ్మని ఒక ఆకుపచ్చని ఆకు - ఈ చేవ లేని చెట్టుకు చిగురులు వేయించాలని చూస్తూ, నిస్సహాయతలో కూరుకుపోయిందనీ - తెలుసును. తెలిసినా తప్పనిసరి ........ ,
మురిగిపోయే ఆచారాలకు అవగాహన కాదు - తరచిచూస్తూ, పుండును కెలికే లోకం - ఆ ఆర్తిని అర్ధం చేసుకోదు, అసలు పట్టించుకునే అవసరం ఈ జగతికి లేనేలేదు కదా!!!,   
       భవ్యకు వయసు వచ్చిందనీ, వివాహం చేయాలనీ తెలిసినా - తల్లిదండ్రులు ఉదాసీనంగా ఊరుకున్నారు. ఆర్ధిక అవసరాలు 'తమ కుమార్తెది కూడా ఒక జీవితమేననీ, అది కళకళలాడాలనీ ' వారిని గుర్తించకుండా చేసాయి.
      మీదుమిక్కిలి, పెద్దా చెల్లెలు "నీ వలననే నేనిట్లాగ మోడులా ఉండిపోవలసి వచ్చింది." అంటూ తన రెండో చెల్లెలు రుసరుసలాడుతుండేది, "పెళ్ళీ పెటాకులూ లేకుండా మాకు అడ్డుగా ఉన్నావు." అంటూ నిందలు గుప్పించారు. సినిమాలకు, జేబు ఖర్చులకు - వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వలేకపోయేది. ఇంట్లో చిల్లర దొంగతనాలు మొదలైనాయి. 
చిన్న చెల్లెళ్ళనీ, తమ్ముళ్ళనీ - మేనత్త కుటుంబీకులనీ చిన్న మాట ఐనా అనలేని దౌర్భాగ్యస్థితిలో మానసికంగా కుంగిపోయేది.
      భవ్య ఇద్దరు  చెల్లెళ్ళ పెళ్ళిళ్ళను సైతం తన చేతుల మీదుగానే చేయక తప్పలేదు. వాళ్ళిద్దరూ ప్రేమవ్యవహారాలు నడిపి, తమ నెత్తిమీదకు సమస్యలను తీసుకువచ్చిన ఘటికులు.
తన కుటుంబ పరువు ప్రతిష్ఠలు నిలవాలి కదా! అందుకే తనవారి శృతి మించిన వ్యవహారాలను - సమాజం అనే పాత్రలో ఇమిడేటట్లుగా చేసేటందుకు - యావజ్జీవితాన్నీ ఫణంగా పెట్టాల్సివచ్చింది.
తండ్రి విడిచిపెట్టిన గృహసామ్రాజ్యం ఇది,  భవ్య భుజస్కంధాలపై పడిన ఈ భారాన్ని మోస్తూన్న జీవన మార్గ గమనం - పన్నెండేళ్ళు - ఔతున్నది.
ఇప్పటికి కొస సోదరీ సోదరుల చదువులు హైస్కూలు, కాలేజీ మెట్లు ఎక్కుతున్నవి. పర్త్ - 3 ;-  
ఈ మధ్యలో ఒక సంఘటన - మేనత్త పెద్ద కుమార్తె "కొత్త సినిమాకు వెళ్తాను." అన్నది, అడిగీ అడగంగానే డబ్బులు ఇవ్వలేదని, సినిమాకు పంపించలేదనిన్నీ - 
ఏదో మందు మింగేసి, ప్రాణాల మీదికి తెచ్చుకుంది, 
ఆ పిల్లని హాస్పిటల్లో చేర్చి, నయం చేయించడానికి, 
భవ్య తలప్రాణం తోకకి వచ్చింది.
ఇట్లాంటి అడ్డగోలు ఖర్చులు, ఇంటి సభ్యుల పెళ్ళిళు, ఆనక పదహారు రోజుల పండుగలు, పిమ్మట శ్రీమంతాలు - పురుళ్ళు, బారసాలలు - 
వెరసి తడిసి మోపెడు ఔతున్న వ్యయాల లిస్టులు - తరుముకు వస్తూనే ఉన్నాయి. 
ఎలాగోలా శుభకార్యాదులన్నిటినీ పూర్తిచేస్తూనే వచ్చింది, ఐనా మూతి ముడుపులూ, ముక్కు విరుపులూ తప్పలేదు.
కాలేజీలో చేరిన తర్వాత - చెల్లెళ్ళు అండ్ తమ్ముళ్ళు అండ్ కో - 
"క్లాసులో ఫ్రెండ్స్ మాదిరిగా ఉండాలి" - అనుకునే పిల్లకాయితనం - ఆకతాయి కోర్కెలు - 'తోటివారికి మల్లే, ఖరీదైన బట్టలు లేవు" అంటూ నసగసాగారు. వారి గొంతెమ్మ కోరికలు తీర్చడానికి సతమతమౌతుండగనే, ముప్ఫై వసంతాలు జరిగిపోయాయి. 
"భవ్య ముది మొహం పడిపోయింది.' అంటూ కామెంట్ చేయడాన్ని భరించలేక, లోలోన కృంగుబాటు. 
భవ్య చిన్ననాటి క్లాస్‌మేట్స్, స్నేహితురాళ్ళు, స్నేహితులు చక్కని కాపురాల కుదుళ్ళలో భద్రంగా కనిపిస్తూ, కళళలాడుతున్నారు. 
****************************************************************  ,  

& చీకటి దారిలో వెన్నెలల అడుగుజాడలు - 1 [64 ]  ; 

PREV ;- పూలు ఫూల్సు - 63 - A ;- దిలీప్ బృందంతో  నల్లమల సీమను చేరాడు. సినిమా దర్శకత్వం చాన్స్ లభించింది - అందుకే ఈ హుషారు -Hills  దగ్గరలోనే చక్కని బంగ్లా - గెస్ట్ హౌస్ సౌకర్యాలు - అన్నీ ఉన్నది ;-  7, జులై 2025, సోమవారం =🎹🎹 ; లేబుళ్లు: @for cinema story కథ, కథాకళి కాదంబరి 2021 🎻🎻 ;;  

చీకటి దారిలో వెన్నెలల అడుగుజాడలు - 1 [64 ]

భవ్య ఉలిక్కిపడింది. పొద్దుటినుండీ ఆమె మనసు అదీ ఇదీ అని చెప్పలేని దిగులు, విప్పి చెప్పలేని గుబులు, ఒక రూపు కట్టని చిత్రంలా, ఆమె ఆలోచనలు కేవలం...