29, మే 2021, శనివారం

మల్లీశ్వరి స్వప్న సారాంశం

 రాజమౌళి శ్రీకూర్మం రాగానే చేసే మొదటి పని,  పుష్కరిణిలో కాళ్ళు కడుక్కుని, ఆవరణలో ఒక మూల ఉన్న నక్షత్ర తాబేళ్ళను చూడడం. వాటిని కొంతమంది ఔత్సాహికులు ఇష్టంగా పెంచుతున్నారు. సరస్వతీదేవి చేతి వీణ పేరు కచ్ఛపి, అంటే తాబేలు పై డిప్పతో చేయబడినది. ఆదిమహావిష్ణుమూర్తి అవతారం , కనుకనే రాజమౌళికి ఈ కోవెల సందర్శనం చాలా ఇష్టం. గుళ్ళో వరండాలో కూర్చుని, కొందరు స్త్రీలు, పురుషులు - శ్రీరామ నామావళి, విష్ణు సహస్రం పఠిస్తున్నారు. 40 రోజులు పారాయణం చేస్తారు, కొంతసేపు కొందరు చదివి, వెళుతున్నారు, ఆ డ్యూటీని అందుకుంటున్నారు కొత్తవాళ్ళు. గొలుసుకట్టు పద్ధతిలో సాగుతున్న ఈ పారాయణం బహు ముచ్చటగా ఉంది  శ్రవణానందకరంగా శ్లోక పఠనం పూర్తిగా మండలం రోజులు చేస్తారు. 

రాజమౌళి గర్భగుడిలో పూజా కార్యక్రమాలు అయ్యాక, ప్రసాదం అందుకున్నాడు. గుళ్ళో ఈసారి ఒక కొత్తదనమేదో తోచింది రాజమౌళికి , అదేమిటో అతనికి ఇతమిత్థంగా బోధపడ లేదు. బైటికి వచ్చి అక్కడ ఉన్న పుస్తకం తీసుకుని, కూర్చుని తానూ దైవ స్తోత్రంలో పాల్గొన్నాడు. గంట చదివి, అప్పుడే వచ్చిన కొత్త వ్యక్తికి పుస్తకం ఇచ్చి బయలుదేరాదు. గుడికి కొందరు ఫ్రెండ్స్ వచ్చారు. 

"రాజమౌళీ! పూనా నుండి ఎప్పుడు వచ్చావు?" అంటూ పలకరించారు. పాత స్నేహితుల కలయిక అంటే - నిన్న మొన్నటి జ్ఞాపకముల గాలి నిండి, మనసు వేణువు అవడమే. 

ఆలయ పూజారి కూడా వారి ఊసుల అభిరుచులను పంచుకుంటూ తానూ కొంచెం చక్కెర పలుకులను కలుపుతూంటే - వాతావరణం మరింత ఆహ్లాదంగా మారింది. దేవాలయం ప్రసాదాలు,కబుర్లు కాకరకాయలతో అందరి మనసులు పూర్ణం ఔతున్నవి. 

అందరూ సెల్ఫీలు తీసుకొనే ప్రోగ్రామ్-మొదలెట్టారు. గుడి పక్కనే కోనేరు దగ్గరికి వచ్చారు. ఫొటోలు తీసుకుంటున్నప్పుడు బోధపడింది, ఆ పుష్కరిణీ నీళ్ళు స్ఫటిక స్వచ్ఛంగా మెరుస్తున్నవి.

ఔను, నిజమే, తన కళ్ళని తానే నమ్మలేక పోతున్నాడు రాజమౌళి. ఇదివరకు వచ్చినప్పుడు కొలను దగ్గరికి వచ్చేసరికే పాచి వాసన వచ్చింది. పచ్చగా ఉన్న నీళ్ళ నిండా ఆకులు అలములు, చెత్త చెదారం ఉండేది. వెగటు పుడుతున్నా, ఏదో శాస్త్రానికి నీళ్ళు మీద చల్లుకుని, గుళ్ళోకి దారి తీసేవారు. ఇప్పుడు దోసిట్లోకి తీసుకుని, హ్యాపీగా తాగి, నెమ్మదిగా మెట్లెక్కి వచ్చాడు తను,

రాజమౌళికి తేడా అర్ధం అయ్యింది, పుష్కరిణి జలం - అద్దంలా ఉంది - ఆకాశం ప్రతిఫలిస్తున్నది, మనల్ని మనం అద్దంలో మాదిరిగా చూసుకోగలుగుతున్నాము. 

తనకు తోచిన ఆ సంగతినే- పక్కన నిలబడి, మాట్లాడుతున్న వారితో చెప్పాడు.  

"అయ్యారే, ఐతే ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి, రాజమౌళీ" అంటూ ఒక్కొక్కళ్ళు అతనికి చెప్పిన విశేషాల సారాంశం ఇదిగో -  

@@@@@@

మల్లమ్మ అనే ఆవిడ ఈ ఊరు చేరింది. ఆమె పూజారి సోమేశ్వర శర్మ కుటుంబానికి 

సుపరిచితయే.  మల్లమాంబ వార్ధక్య దశలో మతిస్థిమితం లేనిదై, ఇంట్లోంచి బైటికి వచ్చింది. పాపం, ఇంట్లో వాళ్ళు 'తప్పిపోయింది' అని పేపర్ ప్రకటన ఇచ్చినా నిష్ప్రయోజనం అయ్యింది. 

కొన్ని రోజులకు ఈ ఊరు చేరిన మల్లమ్మను గుర్తు పట్టారు. ఆమె పిల్లలకు ఫోన్లు చేసి చెప్పారు అతనికి ఆలయ అర్చకుడు సోమేశ్వరశర్మ.  అసలేం జరిగింది - అర్ధమవడాని కొంత సమయం పట్టింది. 

@@@@@@

నాటి మల్లీశ్వరి ఇజీక్వల్ట్ - నేటి మల్లమ్మ భర్త రాధాకృష్ణమూర్తి. మల్లమ్మ సంతానం నలుగురు, బాగానే సెటిల్ ఐనారు. రాధాకృష్ణమూర్తి రిటైర్ ఐనాక, భార్య మల్లీశ్వరితో స్వంత పల్లెను చేరారు. మల్లీశ్వరి ఉరఫ్ మల్లమ్మ, గ్రామీణ వాతావరణంలో స్థిమితంగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అమ్మాయి, అబ్బాయిలు "మా దగ్గర వచ్చి, ఉండండి" అంటూ పిలిచారు.  దంపతులు అక్కడికి వెళ్ళారు గాని, టౌను గాలి పడలేదు, అక్కడ ఇమడలేక తిరిగి వచ్చారు.    

@@@@@@

కొన్ని ఏళ్ళ తర్వాత,  రాధాకృష్ణమూర్తికి దేశ రాజధానిలో మంచి అవకాశం రావడం, ఇద్దరూ ఢిల్లీకి చేరడం జరిగిపోయాయి. ఆర్ కె ఎమ్ ఉరఫ్ రాధా ఉరఫ్ రాధాకృష్ణమూర్తిలో కొత్త జాబ్ హుషారు మెల్ల మెల్లగా చప్పబడింది.   

మహానగరంలో పరుగుల జీవిత రీతికి, వయసు అనుమతించడం లేదు. "కంపెనీ వారికి రాసి ఇచ్చిన బాండ్ ఇక నాలుగు నెలలకు పూర్తి ఔతుంది. మళ్ళీ మన ఊరు వెళ్ళి తృప్తిగా గడుపుదాం." అన్నాడు భార్యతో. ఉన్నట్టుండి, ఒక రోజు "కూరలు తెస్తానని" వెళ్ళిన మల్లమ్మ ఇంటికి తిరిగిరాలేదు. గుండె గుభిల్లుమన్న రాధాకృష్ణమూర్తి, పిల్లలు, చుట్టాలుపక్కాలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసారు.  వాళ్ళ అన్వేషణ సాగుతుండగా, ఏడాది తర్వాత, కూర్మం చేరిందని తెలుసుకుని, "హమ్మయ్య" అని అనుకుని, RKM భార్య మల్లమ్మను కలిసాడు. 

@@@@@@

కొన్ని రోజులు ఉన్నాక - మరలి వెళదామని అనుకున్నాడు. మల్లి "ఇక్కడే ఉందాం" - అన్నది. "సరే!" అని ఒప్పుకున్నాడు రాధా. "రాత్రి నాకో కల వచ్చిందండీ." పంచపాళీలో కూర్చున్న రాధాకృష్ణమూర్తి "ఏమిటో చెప్పు." అన్నాడు. చండ్రనిప్పులు చెరుగుతున్న వేసంగి కాలం, ఊరుకూరికే చెమటలు పడ్తూంటే, ఒకటే విసుగు పుడ్తున్నది. మల్లి నుడివిన స్వప్న సారాంశం  ఆర్ కె ఎమ్ కి నవ్వు పుట్టించింది. వింతగా అనిపించినా అంగీకారం తెల్పాడు. కొన్ని మాసాలకే సత్ఫలితాలను ఇచ్చింది వారి ఆచరణ. 

ఎండా కాలంలో గుడిలోని సరస్సు, ఎండిపోతుంది. అందుచేత బురద మిగిలింది. ఎవరైనా కాళ్ళు కడుక్కుందామని దిగితే, మోకాలు దాకా బురదలో కూరుకుపోతారు. అందులో మీనులు, జలచరాల సంగతి చెప్పేందుకు ఏముంటుంది గనుక.   @@@@@@

మల్లమ్మ అర్చకులకు, తనకు వచ్చిన కల గురించి చెప్పింది. 

సాక్షాత్తూ భగవంతుని ఆదేశం కదా, సోమేశ్వరశర్మ తదితరులు "ఇది మంచి ఆలోచనే కదా." అని ఆమోదముద్ర వేసారు. 

ఈ నేల పుణ్యభూమి, కనుక ఇక్కడి మట్టి పవిత్ర మైనది. కనుక, గుడి పుష్కరిణి  మాత్రమే కాక, 

ఊరి బావులు, ఇత్యాది జాగాలలో నుండి అడుగుబొడుగు బురద మన్నును బైటికి తెచ్చి, పిడకలుగా చేయసాగారు. కలబంద, చెట్ల ఆకు పసర్లు కలిపి, ఉండలు చేసి, అరచేతుల్లో తట్టి, గోడల మీద, నేల మీద పేరుస్తున్నారు. మధ్యలో బెజ్జాలు పెట్టి, చేసింది మల్లమ్మ. 

తక్కిన వారు కూడా, ఆమెను ఫాలో ఐతున్నారు. పురికొసను దూర్చి, కట్టి, మేకులకు వేళ్ళాడదీసింది. గారెల దండల్లా ఉన్నయ్ అవి. ఇంటింటా 'మిత్తి దండలు  వెలిసాయి. , ఆ మట్టి గారెలు - వడమాలలులా అగుపిస్తున్నవి.

యజ్ఞ యాగాలు, పూజలలో ఆ మట్టి బిళ్ళను ఉంచే వారు. కర్షకులు వాటిని భక్తితో తీసుకుని, నీళ్ళలో కలిపి, పొలాలలో  చల్లుకున్నారు. పంటలు సమృద్ధిగా పండాయి. నిజానికి నిజంగా ఇంత మంచి ఫలితాలు  సమకూరుతా యని, రాధా అనుకోలేదు. 

క్రమంగా ఈ సహజ ఎరువులకు డిమాండ్ ఏర్పడింది. మట్టి పిడకలకు రేటు వస్తుంటే, షాపులు వెలిసాయి. రైతు కుటుంబాలలోని వారికి, ఉపాధి దొరికింది.  విక్రయదారులుగా పల్లెవాసులకు, అనుభవం మీద, మార్కెట్ రంగం కిటుకులు, అవగాహన పెరుగుతూ, నవ చైతన్యంతో అందరూ కళకళలాడుతున్నారు.  

@@@@@@

ఇంతకీ ఆమె కల ఏమిటంటే దేవుడు కలలో ప్రత్యక్షమై, - "మల్లమ్మా! గుడిలోని సరస్సు దుర్గతి చూసావు కదా! దానిని బాగుచేయించి, పావన గంగాజలాలుగా మలచు." అని అనుగ్రహ భాషణం అనుగ్రహించాడు.

భగవానుని ఆదేశాన్ని ఊరు ఊరంతా శిరసావహించింది. 

పునరుద్ధరణ జరిగిన తర్వాత - మానస సరోవరం ఇంకొకటి ఇక్కడ వెలసింది, అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. 

"ప్రతి పౌర్ణమి రోజున దేవతలు, అప్సరసలు స్నానాలు చేస్తున్నారు, జలక్రీడలు ఆడుతున్నారు." అంటూ చక్కని కల్పనలు ప్రజల ఊహాప్రపంచాలకు వన్నెలు అద్దుతూ, హరివిల్లులను విరబూయిస్తున్నవి.

"అమాయకంగా ఒక మహిళ శ్రీకారం చుట్టిన పని, ఇన్ని గొప్ప పరిణామాలకు కారణం అయ్యిందా." ఆశ్చర్యానందాల నుండి తేరుకోవడానికి, కొంత టైమ్ పట్టింది రాజమౌళికి. 

సందె వేళ, చల్లబడుతున్నది. రోజు మాదిరిగా, ప్రదక్షిణాలు చేయడానికి, 

మల్లమ్మ దంపతులు కోవెలలోకి వస్తున్నారు. ఆ ఇద్దరు అందరికీ ఆదిదంపతుల మాదిరిగా కనిపిస్తున్నారు.

Canvas - Tune - 5 stories KSM 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...