23, ఏప్రిల్ 2021, శుక్రవారం

మట్టి మగువ ప్రభలు

ఏకవీరా దేవి కోవెలలో ప్రదక్షిణలు చేసి, పూజారి స్వామి ఆశీస్సులు అందుకుని, గుడి వసారాలో కూర్చున్నాడు భైరవి రాజ గురు. వృద్ధాప్యం, కాలం - పోటాపోటీగా తన మేనులోని శక్తిని తూకం వేస్తున్నవి. గుడి వరండా పావంచా - మెట్లు ఇరు పక్కలా - ఏనుగులు ఒద్దికగా కూర్చుని, భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉన్నవి. ఆ బొమ్మలను ప్రేమగా నిమురుతూ కూర్చున్నాడు భైరవ, పల్లె పాకలోని గురుకులం మాదిరి పాఠశాల - ఎర్ర ఏగాణీ తీసుకోకుండా గురువుగా గురుతర బాధ్యతలను తృప్తిగా నిర్వహించాడు - అందుకే ఆయన - భైరవి రాజ గురు - పేరులో గురు శబ్దం పొదిగి ఇచ్చారు ప్రజలు. @@@@@@ భైరవయ్య అభిరుచి - జానపద కథలు, గీతాల సేకరణ. జానపద కథలు అనేకం పోగు చేసాడు. అంతేకాదు, అన్నింటినీ పుస్తకములుగా అచ్చొతించాడు. గ్రంధరూపంలో ప్రపంచానికి అందించాడు. మొగిలిచర్ల కొలను నీళ్ళ పైనుండి వీస్తున్న గాలితెమ్మెరలు మృదువుగా పలకరిస్తున్నాయి. ఊరి సర్పంచి సర్వప్ప ప్రతి రోజూ అక్కడికి వస్తాడు భైరప్పా, అంటూ స్నేహపూర్వకంగా వారి కబుర్లు - చల్లని గాలిని పెనవేసుకుంటాయి. మా వంశీయులు ఈ గుడిని కట్టించారూ స్వామీ, ఇప్పుడు చూడండి ..." వేదనగా సర్వప్ప నిట్టూర్పులు గాలిని వేడెక్కిస్తాయి. "నాన్నా, పొద్దుగూకింది. ఇంటికి వెళ్దాం, రండి. సర్వన్నా, ఇదిగోండి, మీరు అడిగిన పుస్తకం" అందించింది రేణుక. ఇంకా, అలనాటి కాశీ మజిలీలు, చింతామణి కథలు చదివే వారున్నారు - అనే సంగతి భైరవయ్య పిల్లలకు సంతోషం కలిగిస్తుంది. "ఈ మహా గ్రంధాలని ప్రచురణలు చేసి - పన్నెండు ఎకరాలు కరిగించాడు, మనకి నాస్తి మిగిలించి" కొడుకులు కాశీ, భట్టు ల చికాకులు ప్రసాదంగా లభిస్తుంటాయి. రేణు, సర్వప్ప వంటి వారి అనునయ వాక్యాలు భైరవ గురు మనసు తోటలోని పచ్చదనాన్ని కాపాడుతున్నాయి. "మీ నాన్నగారు అమెరికాలో పుట్టి ఉంటే, హిమశిఖరంపై కూర్చుని ఉండేవారు కదమ్మా" సర్వప్ప మాటలకు పెదవులపై లేత నవ్వు విరుస్తుంది. @@@@@@ మనవళ్ళు, మనవరాళ్ళు - డాలర్ల దేశంలో స్థిరపడుతున్నారు. మనమరాలు రుద్రమ దేవి "తాతయ్యా, మీరు ఇంటర్ నెట్ యుగం ఇది." అని తాతకు బహుమానంగా ఇచ్చిన టీ.వీ. లో ఆధునిక ఔకర్యాదులన్నిటినీ నేర్పింది. "రిమోట్ - ఇంత చిన్నవస్తువులో అంత జగతి అద్భుతాలు ఇమిడి ఉన్నవి" సంభ్రమంగా భైరవ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.ముఖ్యంగా జానపద సినిమాలను తనివితీరా చూడసాగాడు.  చాలా కథలు - తాను సేకరించిన ప్రాచీన హిందూ సాహిత్య సంపదలే. "మా పూర్వీకులు - కాసె సర్వప్ప - సిద్ధేశ్వర చరిత్ర - రాసారు భరప్పా, మా పూజ గదిలో భద్రంగా ఉన్నది. మీరు మళ్ళీ ప్రతులు చేసి, ప్రింట్ చేస్తారా!?" కాశీ, భట్ సర్వప్పను అరిచారు."అంతగా దురద ఎక్కువైతే, మీ ఎకరం పొలం అమ్మేసి, ప్రచురించండి, కాదన్న వారెవరు, అడ్డుకునే వారెవరు!?" భట్టు కేకలతో సర్వప్ప అభ్యర్ధన మొదటి రోజునే స్పీడ్ బ్రేకర్ వెనుక ఆగిపోయింది. @@@@@@@@ టివి లో గురువును మించిన శిష్యుడు - సినిమాను చూస్తున్నాడు భైరవ రాజ.రేణుక గబగబా వచ్చింది. "నాన్నా! ఎంతసేపూ సినిమాలేనా, హాట్ హాట్ న్యూస్ వస్తున్నది" అని, రిమోట్ తీసుకుని, వార్తా ఛానెల్స్ పెట్టింది. ఒకదాంట్లో ఒక అమ్మాయి స్వరం వేదికని అదరగొడ్తున్నది. ఈశ్వరి అందరినీ నిలదీస్తున్నది, "నాకు అన్యాయం జరిగింది... " అంటూ వాపోతున్నది. అసలేం జరిగిందంటే - " నే రంగమెళ్ళి పోతాను, నారాయణమ్మా ......  "అనే జానపగ గీతం కథ అది. ఆ పల్లె పాట - వెండితెరపైకి ఎక్కగానే, హిట్ సాధించి, విపరీతమైన జోష్ అందుకున్నది. ఏ నోట విన్నా, ఏ రింగ్ టోన్ విన్నా అదే పాట. "నేను మట్టి పిసికే నేలలో పుట్టాను. వీడియోలలో మొదటగా పాడింది నేనే. ఆ సినిమా వాళ్ళు అడగంగానే,అరవై పాటలు, కష్టపడి రాసి ఇచ్చాను. గుండ్రంగా మంచి చేతిరాతతో - మా తమ్ముడి చేత రాయించాను. బోలెడు ఠావు పేపర్లు, జెరాక్సు ఖర్చులు, మా స్థోమతకు మించి ఖర్చు చేసి, ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి, సినిమా డైరెక్టర్లు, నిర్మాతలకు అందించాము. మా బోటి వాళ్ళు ఆరుగురి కష్టం వాళ్ళ మనసుకు పట్టలేదు. నన్ను వదిలేసి, వేరే సినిమా గాయని చేత పాడించారు. నన్ను అన్యాయం చేసారు, నేను ఊరుకోను" మూడు రోజుల పాటు - అదే వార్తాంశం సంచలనం కలిగితూ బుల్లితెరలపై ప్రసార ఔతున్నది. ఆనక ఆ చలనచిత్ర సంబంధీకులు రాజీ చేసుకున్నారు. వారం రోజుల తర్వాత ఈశ్వరి టెలివిజన్స్ ద్వారా అందించిన శుభవార్త : "జానపద గేయ నిధి" అనే సంస్థను సినీ వర్గం వారి సహకారం అందుకుని, నెలకొల్పింది. జానపద గేయ నిధి - పల్లె బాణీలను గ్రంధస్థంచేస్తుంది, ప్రసారమాధ్యమాలలో, పుస్తకాలుగా కలకాలం భద్రం అయ్యేలా చేస్తుంది, ఈశ్వరి ఆశయాలు నెరవేరే మంచి ఘడియలు - భైరవి రాజ గురు, సర్వప్ప, రేణు వంటి వారికి మోదం, సమ్మోదం కలిగిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు - folk stories వెండితెరను, ముఖ్యంగా మన తెలుగు తెరను స్వర్ణమయం గావించాయి. అయాచితంగా లభించిన నిధులు ఇవి. విజయవంతమైన చిత్రాలకు లభించిన లాభాలలో కనీసం ఐదు శాతం కేటాయిస్తే, అందమైన ఫొటోలతో, పల్లె కథలు - అందరి చేతులలో ఉండేవి. ఇది తన తీపి కల - కొన్నిసార్లు ప్రయత్నించి విఫలుడయ్యాడు భైరవ రాజ గురు. ఈశ్వరి గొంతు ఎత్తిన బంగారు ప్రయత్నం - అద్భుత ఫలితాలను ఒసగింది. ఈ మట్టి చేతుల అమ్మాయి - మన భారతదేశం స్వాతంత్ర్యం పొందిన కొత్త దినాల నాడు ప్రాణం పోసుకున్న తన ఆశని, బీజావస్థ నుండి, మహాతరువుగా పెరిగేలా ప్రోత్సహించగలిగే విశిష్ట మహిళయే ఈశ్వరి, భైరవ, తదితరులు మట్టి మనిషి ఈశ్వరి దీక్ష, ఆచరణలల నుండి వెదజల్లి విరబూస్తున్న అరుణకిరణాల దొంతరల వైపు చూస్తున్నారు. "సామీ, భుజంపైని కండువాను దులిపి వేసుకోండి. ఇంకా స్తబ్ధుగా అట్లాగే కూర్చున్నారే" వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టిన ముగ్గు దగ్గర నిలబడిన వ్యక్తి సర్వప్ప కంచుకంఠం అది.  ; [పాత్రలు ;- భైరవి రాజ గురు - ఈశ్వరి - సర్వప్ప  & రేణుక - కాశీ, భట్టు] ; & మట్టి మగువ ప్రభలు ;- Telugu Story - మాలిక web సాహిత్యపత్రిక ; రచన: కాదంబరి కుసుమాంబ ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...