పెళ్ళి ఐన పుష్కరానికి స్వంత ఇల్లు కట్టుకున్నారు గిరిజ, కృష్ణారావు దంపతులు. మిగిలి ఉన్న కొరవ పనులను చేయిస్తున్నది గిరిజ. గిరిజకి తులసి కోట అంటే ఎంతో ఇష్టం. మేస్త్రీ పర్జన్యకు ఈ నిర్మాణ కార్యక్రమాన్ని పురమాయించింది.
మేస్త్రీ పర్జన్య “రోడ్డు పక్కన మంచి తులసి కుండీలు దొరుకుతున్నాయి, ఇంత శ్రమ ఎందుకమ్మా!” అన్నాడు.
అతను ఇప్పటిదాకా తులసి మొక్కకు పెరటి కుండీని కట్టే అవసరం రాలేదు. అందుకని ఈ నాన్పుడు వ్యవహారం.
గిరిజ మేస్త్రీ మాటలను పెడచెవిని పెట్టింది. భర్త క్రిష్ణారావు కూడా చెప్పి చూసాడు,
కానీ ఆమెది ఉడుం పట్టు కదా మరి, పట్టు మరి వీడలేదు.
మేస్త్రీ పర్జన్య లోపల్లోపల బెరుకుగానే ఉన్నప్పటికీ, గిరిజా కుమారి ఆనతిని పాటించక తప్పలేదు.
కాగితం మీద డిజైన్లు గీసి ఇచ్చింది. ఇంటర్నెట్ నుండి చాలా ఫొటోలు చూపించింది.
మొత్తానికి పర్జన్య పని పూర్తి చేసాడు.
గిరిజమ్మ చెప్పినట్లు రాకున్నా, కాస్త బాగానే కుదిరింది.
“ఆహా, నాకు కోట కట్టడం చేతనయ్యింది. ఇంక – మనకి ఇది కొత్త మలుపు. ఇంట్లో పెళ్ళాం ఖాళీగానే ఉంది.
తులసి కోటలు చేసి, సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను.” సంతృప్తిగా అనుకున్నాడు పర్జన్య.
పాత మట్టి కుండీలోని మొక్కను జాగ్రత్తగా తీసి, కొత్త కోటకు మార్చింది.
ఇల్లిల్లూ గాలించి, కృష్ణ తులసి మొక్కను తెచ్చి, అందులోనే నాటింది.
స్పెషల్ గా కొన్ని కొత్త వ్రతాలు, నోములు కనిపెట్టింది.
అంతర్జాల మహిమ కతంబున ఉత్తరాది మరాఠీ వగైరా వ్రతాలను సేకరించింది.
ఇరుగు పొరుగు – స్నేహితులను, బంధువులను విడతలవారీగా పిలిచి, బొట్టు తాంబూలం వాయనాలు ఇచ్చేది.
తర్వాత పెరట్లోకి తీసుకెళ్ళి, “నేను చాలా కష్టపడి కట్టించాను. చూడండి, ఎంత అందంగా ఉందో!” అని నొక్కి వక్కాణించేది.
పేరంటాళ్ళు “ఆహా, ఎంత బాగున్నదో. నువ్వు చదువుకొని ఉంటే ఇంజనీర్ అయ్యేదానివి.” అని ఫ్రశంసించే వారు.
“ఏమిటో అక్కా! పైటచెంగు వెయ్యడం ఆలస్యం, గుండెల మీద కుంపటి ఆడపిల్ల అంటూ అనుకుంటూ –
నన్ను పెళ్ళిపీటలు ఎక్కించేసారు. సంసారం, జంఝాటం, విద్యకు ఆస్కారం ఎక్కడుంటుంది, చెప్పు.”
నిట్టూర్చేది గిరిజ. నూతన గృహప్రవేశం సంరంభం, ఆనందం మనసారా ఆస్వాదిస్తున్నది గిరిజ.
ఇంతలో ఆమె భర్తకు ప్రమోషన్ వచ్చింది, బదిలీ అయ్యింది.
“ట్రాన్స్‌ఫర్ వాయిదా కుదుర్తుందేమో, కొంచెం ట్రై చెయ్యండి.” అన్నది.
“ప్రమోషన్ తో వచ్చిన బదిలీ కదా గిరీ, చెన్నై సిటీ లైఫ్ బాగుంటుందని, మా అన్నయ్య చెప్పాడు” క్రిష్ణారావు ఉవాచ.
అన్ని సామాన్లు సర్దుకున్నారు. లారీలోకి ఇంటెడు సామగ్రిని చేర్చారు నలుగురు కూలీలు.
చీకటి పడడంతో, “కొద్ది సరంజామానే కదండీ, రేపు ఎక్కిస్తాం.” అని వెళ్ళిపోయారు.
మిగిలింది గిరిజకుమారికి ప్రాణప్రదం ఐన తులసికోట.
“మధ్యాహ్నం 3 గంటలకి ఫ్లైట్, లారీ వాళ్ళింకా రాలేదే.” అంటూ …
తొలి పొద్దు మసక చీకటి నుండే గాభరా పడసాగాడు క్రిష్ణారావు.
11 గంటలకు డ్రైవర్, క్లీనర్ వచ్చారు. త్వరత్వరగా తక్కిన కొద్ది లగేజీని లారీలో పెట్టారు.
ఇక ఉన్న ఆ ఏకైక వస్తువు, గిరిజ చూపించింది,
వాళ్ళకు గుండె గుభిల్లుమంది. “ఇంత పెద్ద తొట్టిని ఎట్లాగ మొయ్యాలి!?”
“తొట్టి కాదు, తులసి కోట – అనాలి.” ఆమెతో పాటు, వాళ్ళున్నూ భయభక్తులతో చెంపలు వేసుకుని
“ఇప్పుడెట్లా!” అని తర్జనభర్జనలు పడ్డాక,
“మనమే తిప్పలు పడదాము. తప్పుతుందా!?” అనుకుని, ధైర్యం తెచ్చుకున్నారు.
గుండె దిటవు చేసుకుని, ఇద్దరు దాన్ని లేపాలని try చేసారు. ఊహూ … వీలు కాలేదు,
ఎగస్ట్రా పనులకి కూలీల కోసం దెవుళ్ళాడేరు గానీ ఎవరూ దొరకలేదు.
ఇక ఆ ఇద్దరు దొర్లించుకు వద్దామని చిట్టి చెట్టు పైన చెయ్యి వేయ్యబోయారు.
అక్కడ నిలబడి ఉన్నది వేరెవరో కాదు, యజమానిని గిరిజా కుమారి … ,
“భుజం పైన పెట్టుకోండి, నెమ్మదిగా తియ్యండన్నా!”
'అన్నా'- అని ఆ పిలుపు – కరిగిపోయారు.
“ఐసరబజ్జా! హుప్” అంటూ అతి కష్టమ్మీద కొంచెం ఎత్తగలిగారు.
పది గోతాలు తెచ్చి, అడుగున పెట్టి, నేల పైన నెడ్తూ ముందుకు తీసుకెళ్ళారు.
“మేమేమన్నా బాహుబలి అనుకుంటున్నావా ఏంటమ్మా!!?” ఏడుపు మొహాలు పెట్టారు, చెమటలు కక్కుతూ.
వాహనం దాకా ఈడుస్తూ తెచ్చారు, గానీ, పైకెక్కించే పని సంగతి గతి ఏమిటి? …. ,
అప్పటికి అపరాహ్ణం దాటవస్తున్నది. కృష్ణారావు వచ్చి, ఓ చెయ్యి వేసాడు. క్లైమాక్స్ ఘట్టం జయప్రదమైంది.
“పట్టపగలే చుక్కలు కనబడటం అంటే ఇదే కాబోలు, హమ్మయ్య” క్లీనర్ చతికిలపడ్డాడు.
“మా అమ్మ దగ్గర తాగిన *మొరుంబాలతో సహా అన్నీ అరిగిపోయాయమ్మా!”
డ్రైవర్ మాటలకు పగలబడి నవ్వాడు క్లీనర్ కోటబొమ్మాళి. గిరిజాపతి, వాళ్ళకి నాలుగు నూర్లు ఇచ్చి,
“దారిలో ఏ హోటల్ దగ్గరైనా ఆగి, మీల్సు తినండి. మీకు థాంక్స్, నిజంగా చాలా కష్టపడ్డారు.”
జతగా రామతులసి మొక్కను కూడా సంపాదించాలి,
"ఐతే నాకు next town లో కావలసినంత పని అన్న మాట." భర్త నవ్వుతూ అన్నాడు
లారీ బయలుదేరింది, గిరిజ దంపతులు, విమానశ్రయాన్ని చేరుకున్నారు.
లగేజీ చెకింగ్ పూర్తి ఐనాక, ఛెయిర్స్ లో కూర్చున్నారు. ఇంటి దగ్గర ఇందాకటి డైలాగులు గుర్తు వస్తుంటే,
తెగ నవ్వుకుంటూ … , ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నారు.
***********
*మొరుంబాలు = *మొర్రుంబాలు - తల్లి వద్ద బిడ్డ త్రాగే తొలి పాల చుక్కలు ;
************************************************,
[ పాత్రలు ;- కృష్ణారావు దంపతులు ;; మేస్త్రీ పర్జన్య -క్లీనర్ కోటబొమ్మాళి ]
కోట కోసం ఐసరబజ్జా ; story ;
![]() |
June 2021 My Telugu story |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి